చలవ మిరియాలు – Chalava Miriyalu – Malladi Ramakrishna Sastry – Book Review
Video / September 15, 2020

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి చలవ మిరియాలు పుస్తక సమీక్ష! “ఆయన పలుకుల్లోంచి అమృతం పుట్టింది, అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది” అని వేటూరి గారు మల్లాది వారికి నమస్సులర్పిస్తే.. “తెలుగుదనం పోయింది-తెలుగు ధనం పోయింది” అంటూ మల్లాదివారు మరణించిన రోజు కన్నీరు మున్నీరుగా విలపించారు ఆత్రేయ. “తెలుగుకున్న రంగూ, రుచీ ఎరిగున్న రచయిత” మన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటూ వారిని అంతెత్తున పొగిడారు పాలగుమ్మి పద్మరాజు గారు. తన సినీరంగ ప్రవేశానికి కారకులైన మల్లాది రామకృష్ణశాస్త్రిగాకి, తన సినిమా పాటల పుస్తకాన్ని అంకింతం ఇచ్చి నమస్కరించుకున్నారు శ్రీశ్రీ గారు. సినిమా పాట రాసేటప్పుడు ఎప్పుడైనా, సరైన మాటలేవీ తట్టకపోతే.. “ఈ సందర్భానికి మా గురువుగారు మల్లాది వారైతే ఎలా రాస్తారు” అని ఆలోచించి కలం కదిపేవారట ఆరుద్ర గారు. ఎందరో ప్రఖ్యాత రచయితలకు, కవులకు గురువైన పండిత కవి మన మల్లాది వారు. మల్లాది వారి ప్రతిభను తూచడానికి అంతటి సాహిత్యపు బరువుగల తూనికరాళ్లు కూడా మనకు దొరకవు. కథకుడిగా, సినీ కవిగా, పండితుడిగా ఆయన స్థానం ఎప్పుడూ శిఖరాగ్రమే! సుమారు 80 యేళ్ళ క్రితమే, పేరొందిన అన్ని పత్రికలలో వారి కథలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే… ఈ “చలవ మిరియాలు”. రాజన్ పి.టి.ఎస్.కె #RajanPTSK #Malladi #TeluguLegends